ముప్పు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన

` బాధితులకు భరోసా
` అమీర్‌పేట్‌, బుద్ధనగర్‌, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను పరిశీలించిన సీఎం
` తక్షణ సహాయర చర్యలకు అధికారులకు ఆదేశం
` ముఖ్యమంత్రికి తమ సమస్యలు వివరించిన బాధితులు
హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమీర్‌పేట్‌, బుద్ధనగర్‌, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి ఆదివారం ఆకస్మిక సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్‌ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు.బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్‌, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్‌ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించి ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమీర్‌ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్‌ అనే బాలుడితో ముఖ్యమంత్రి గారు వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి బాలుడికి ధైర్యం చెప్పారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

వరద సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తులా కృష్టి చేస్తున్నాం
` జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ వరద సమస్య పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై గతంకంటే వేగంగా స్పందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపడుతోందన్న పొన్నం ప్రభాకర్‌ ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి : నగరంలో ఆకస్మికంగా భారీ వర్షాలు పడుతున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో సమస్య పెరుగుతోందని అన్నారు. ఆఫీసుల నుంచి అందరూ ఒకేసారి కాకుండా కొంత గ్యాప్‌? తీసుకుని రోడ్లమీదకు వస్తే మంచిదని సూచించారు. ప్రజలు ప్రజారవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిదని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పదేళ్లుగా జీహెచ్‌ఎంసీలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని వివరించారు. వరదనీరు భూమిలోకి ఇంకిపోయే చర్యలు కూడా ప్రజల నుంచి పెరగాలని ఆయన కోరారు. వర్షాకాలంలో నీరంతా వృథాగా పోతోందని వేసవి వస్తే భూగర్భ జలాలు పడిపోయి ట్యాంకర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. అపార్ట్‌?మెంట్‌ వాసులు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మేయర్‌? విజయలక్ష్మి, కమిషనర్‌? ఆర్వీ కర్ణన్‌?, జోనల్‌? కమిషనర్లు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.అవసరమయితే తప్ప బయటకు రావొద్దు : మరోవైపు భారీ వర్షాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా కమిషనర్‌ రంగనాథ్‌ వెల్లడిరచారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని రంగనాథ్‌ ఆదేశించారు. మ్యాన్‌హోల్స్‌, విద్యుత్‌ స్తంభాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రావొద్దని ఆయన సూచించారు