రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):
రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మండలం కొంపెల్లి, గుడాడ్ పల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాల్లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను కోరారు. రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులెవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం గొర్లవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.


