కాళేశ్వరం నివేదికపై కమిటీ

` నివేదిక పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
` సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ
హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ సెక్రెటరీ ప్రశాంత్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రెటరీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు కమిషన్‌ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 4న నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్‌ కు సమర్పించనుంది.
సీఎం రేవంత్‌కు కాళేశ్వరం నివేదిక
అంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అందింది. శుక్రవారం దీనిని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సంబంధిత నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు ఆయన అందజేశారు. శుక్రవారం ఆ నివేదిక సీఎంకు చేరింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు భేటీ- అయ్యారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై వీరంతా చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని నివేదికలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ స్పష్టం చేసినట్లు- తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొన్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని… ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ పేర్కొన్నట్లు- సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డీపీఆర్‌ తయారీ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం… అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది… రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులన్నది వివరంగా నివేదికలో తెలియజేసినట్లు- విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.