అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు.

 

 

 

 

మల్కాజిగిరి,నవంబర్ 3 (జనంసాక్షి)

టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డ జయరాజ్.

టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై డిసి కి ఫిర్యాదు…

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో లోని ఆరు డివిజన్ లలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వివిధ వార్త దినపత్రికలలో వచ్చిన వార్తలను సేకరించి స్థానిక వ్యక్తి ఒకరు సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ, తాను ఐదు నెలల క్రితం ఏడు లక్షల రూపాయల చలానా చెల్లించి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అయితే తన దరఖాస్తును వివిధ కారణాల రూపంలో యూఎల్సీ కార్యాలయానికి పంపారని తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణాలు, పాత బిల్డింగులపై అదనపు ఫ్లోర్ల నిర్మాణాలు, సెల్లార్ల నిర్మాణం, రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
న్యాయబద్ధంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి చలానా కట్టి దరఖాస్తు చేసుకున్న వారిని ముప్పులు తిప్పలు పెడుతున్నారని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్రమనిర్మాణదారులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకొని ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని జేబులో వేసుకుంటున్నారని జైరాజ్ మండిపడ్డారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆయన డిప్యూటీ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు.