పేదల భూములపై కాంగ్రెస్‌ కుట్ర

పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. మూసీ ప్రక్షాళనతో బఫర్‌ జోన్‌, ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలో ఉన్న భూములు, నిర్మాణాలను టార్గెట్‌ చేసింది. తాజాగా భవిష్యత్‌ అవసరాలకు ఎప్పుడో కొనుగోలు చేసుకున్న ఓపెన్‌ ప్లాట్లకు ఎసరు పెట్టింది.కాంగ్రెస్‌ వేస్తున్న అడుగులు… పేదోడి సొంతింటి కలను కాలరాసేలా ఉన్నది. భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా వెంచర్లను నిషేధిస్తున్నట్టుగా జాబితా విడుదల చేసి గందరగోళానికి తెరలేపింది. అక్కడితో ఆగిపోకుండా… జాబితాను నేరుగా హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్‌చేసి వివాదానికి తెరలేపింది. ఆయా లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని ప్రచారం జోరందుకున్నది. కొనుగోలుదారులు కూడ భయాందోళనలతో హెచ్‌ఎండీఏ కార్యాలయానికి చేరుకోవడం… గుట్టుగా జాబితాను వెబ్‌సైట్‌ నుంచి తొలగించి చేతులు దులుపుకొన్నారు. కానీ హెచ్‌ఎండీఏ పేర్కొన్న 650కిపైగా లే అవుట్ల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.కాంగ్రెస్‌ పాలనలో పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది. అనధికారిక లే అవుట్ల పేరుతో కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా పేరిట భయాందోళనలకు గురి చేస్తోంది. ఏడు జిల్లాల్లో విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న జీపీ లే అవుట్లను రద్దు చేసింది. గతంలో డెవలప్‌ చేసిన లే అవుట్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం వలన కొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. 2014 కంటే ముందే ఉన్న అనధికార లే అవుట్లతో కూడిన జాబితాను హెచ్‌ఎండీఏ ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికరూపంలో విడుదలచేసింది. కానీ ఏనాడూ వీటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సూచనలు జారీ చేయలేదు. తాజాగా విడుదలచేసిన జాబితాలోనూ 2014 కంటే ముందే ఉన్న వెంచర్లు, లేఅవుట్లు మాత్రమే ఉండగా… కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అధికారులు గుర్తించినవేవి లేవు. కానీ జాబితా పేరిట జనాల్లో గందరగోళం సృష్టించారు.జాబితాను ఎందుకు తొలగించారు?రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లోని మండలాల వారీగా సర్వే నెంబర్లు సహా రూపొందించిన జాబితాను హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా అప్‌లోడ్‌ చేశారు. అయితే దీనిపై వ్యతిరేకత రావడం, హెచ్‌ఎండీఏకు వచ్చే బాధితుల సంఖ్య పెరగడం, సోషల్‌ మీడియాలో విస్తృత చర్చల కారణంగా అర్ధాంతరంగా జాబితాను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఉన్నఫళంగా ఎందుకు జాబితాను తీసివేశారనేది ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.జాబితా అప్‌లోడ్‌ చేసిన తర్వాత పాత వెంచర్ల వివరాలే అంటూ బుకాయించిన హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ఇప్పుడూ ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. ఒకసారి జాబితాను విడుదల చేసి, ఆవెంటనే తొలగించడంతో అటు బిల్డర్లకు వేధింపులు పెరగడంతోపాటు, కొనుగోలుదారులకు నష్టభయం పట్టుకుంది. ఇక ఉన్న ప్లాట్ల క్రయవిక్రయాలు నిలిచిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. జీపీ లే అవుట్ల విషయంలో జరుగుతున్న భయాందోళన చర్యలకు స్వస్తి పలకాలని, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలను పునరుద్ధరించాలని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు.