కాంగ్రెస్ నేతలకు దృష్టి, వినికిడి పరీక్షలు అవసరం
వరంగల్ ఈస్ట్, జూన్ 11 (జనం సాక్షి): భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రులలో ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యంత సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసి విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్ పటేల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం అంతా ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలు నిర్వహిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మోదీ గారి దిష్టిబొమ్మలను దహనం చేయడం వారి రాజకీయ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.”తాము సాధించలేనిది మరొకరు సాధిస్తే తట్టుకోలేని మనస్తత్వమే కాంగ్రెస్ పార్టీది. ప్రజల మద్దతుతో వరుసగా ప్రధానమంత్రిగా ఎన్నికై దేశాన్ని ప్రపంచ వేదికపై మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం” అని ఆయన అన్నారు.ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే “తాను తవ్విన గోతిలో తానే పడినట్టు” అనే సామెత గుర్తుకు వస్తోందని సిద్ధం నరేష్ పటేల్ వ్యాఖ్యానించారు.మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తన పాత్రపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని, అనంతరం బీజేపీపై ఆరోపణలు చేయాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందని ఆయన పేర్కొన్నారు.ఒకప్పుడు ప్రపంచ వేదికలపై భారత్‌ను పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉండేదని, నేడు G20 వంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, డిజిటల్ విప్లవం గురించి మాట్లాడాల్సిన కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి చర్చలకు బదులుగా ఆరోపణల రాజకీయాలకే పరిమితమైందని ఆయన విమర్శించారు.



