చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా

జనం సాక్షి నవంబర్6హైదరాబాద్ : చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మీర్జగూడ వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొని 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన స్థానికులపై కేసు నమోదు చేయడంపై రేవంత్ సర్కార్‌పై చేవెళ్ల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రవాణా శాఖ, హోం శాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని, రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని హెచ్ఆర్సీ ఆదేశించింది.



