జడ్చర్లలో తాగునీటి కష్టాలు

జడ్చర్ల, మే 28 (జనంసాక్షి):  జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్యలు నానాటికీ ముదురుతున్నాయి. గత పది రోజులుగా పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజుల నుంచి నల్లాలు రాకపోవడంతో దైనందిన అవసరాల కోసం మహిళలు, వృద్ధులు కిలోమీటర్ల మేర నడిచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి, పేద కుటుంబాలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించలేక, దొరికిన కాడికి నీటిని కొనుగోలు చేస్తూ తీవ్ర ఆర్థిక భారానికి గురవుతున్నారు. పది రోజులైనా ఒక్క చుక్క నీరు వదలకపోతే ఎలా బతకాలని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా అత్యవసరంగా నీటిని అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి జడ్చర్ల పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.