డ్రైవర్‌ చాకచక్యం.. ప్రయాణికులు సురక్షితం

నాగర్‌కర్నూల్‌ బ్యూరో (జనంసాక్షి) : కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం పెద్దవాగు వద్ద పెనుప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌ నుంచి ముక్కిడిగుండంకు వెళ్లే క్రమంలో కొందరు ప్రయాణికులతో ఉన్న బొలేరో వాహనం అక్కడ బ్రిడ్జి వద్ద వాగుదాటుతున్నది. ఈ క్రమంలో అదుపుతప్పి కిందకు వెళ్లిపోతుండగా.. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే బ్రేకులు వేసి వాహనాన్ని రివర్స్‌ తీసుకున్నాడు. దీంతో కిందకు వెళ్లిపోకుండా వాహనం నిలిపేయడంతో వెంటనే ప్రయాణికులు కిందకు దిగి ఒడ్డుకు చేరారు. ఏ చిన్న ఏమరపాటుతో వ్యవహరించినా పెనుప్రమాదం సంభవించేదని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తమ గ్రామానికి వెళ్లే క్రమంలో దూరభారం తగ్గించేందుకు ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. అయితే గత కొన్నినెలలుగా సాగుతున్న బ్రిడ్జి పనులు ఇంకా పూర్తికాకపోవడం వల్ల ప్రయాణికులు ప్రమాదపుటంచున వాగుదాటాల్సిన పరిస్థితి నెలకొంది.