బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఆర్ఓ


చదువు, భోజనం, వసతి సౌకర్యాలపై ఆరా
దిలావర్‌పూర్, ఆగస్టు 6 (జనం సాక్షి): దిలావర్పూర్ మండల కేంద్రంలోని సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ), మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రమేష్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థినులను పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి విద్యా ప్రతిభను పరిశీలించారు. ప్రతి విద్యార్థిని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ముఖ్యమైన సూత్రాలు, ఫార్ములాలు, కీలక అంశాలను చార్ట్‌ల రూపంలో తయారు చేసి గదుల గోడలపై ఏర్పాటు చేసుకుంటే సులభంగా గుర్తుంచుకోవచ్చని తెలిపారు. అలాగే విద్యార్థులు యూనిఫాం దుస్తుల పంపిణీ గురించి వార్డెన్ను ఆరా తీశారు. అనంతరం వసతి గృహంలోని వంటశాల, భోజనశాల, విద్యార్థినుల గదులు, తాగునీటి సౌకర్యలను, పరిశుభ్రత నిర్వహణను పరిశీలించారు. తనిఖీ అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన డీఆర్ఓ, వారికి ప్రతిరోజూ నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్ వనిత కు సూచించారు. వసతి గృహంలో పరిశుభ్రతను కచ్చితంగా పాటిస్తూ విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో ఎంపీడీఓ గోవర్ధన్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



