చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు

చేర్యాల (జనంసాక్షి) మే 30 : చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలోని బండారి అంజయ్య అనే రైతు వ్యవసాయ బావి దగ్గర చేతికందేలా విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదానికి నిలయంగా మారాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ట్రాక్టర్లు దున్నడానికి, వరి చేను కోయడానికి యంత్రాలు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. మధ్యలో రెండు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గత ఆరు నెలల నుండి జేఎల్ఎం, లైన్ మెన్, ఏఈ, ఏడీఈ లకు మొరపెట్టుకున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బావుల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు, మేత మేసే పశువులు విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మధ్యలో స్తంభాలు వేసి ప్రమాదం నుండి కాపాడాలని వేడుకున్నాడు.