నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు

శంకరపట్నం జూన్ 10 జనం సాక్షి: శంకరపట్నం మండలం కల్వల గ్రామ శివారులోని క్వారీగుట్ట ప్రాంతంలో నాటుసారా (గుడుంబా) తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో వీణవంక గ్రామానికి చెందిన లోకిని స్వామి అనే వ్యక్తి అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే అధికారులు చేరుకునేలోపే నిందితుడు ఘటన స్థలం నుంచి పరారయ్యాడు.దాడుల సందర్భంగా అధికారులు నేరస్థలంలో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన 900 లీటర్ల నల్లబెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే 20 లీటర్ల నాటుసారా, 5 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న టీవీఎస్ మోటార్ సైకిల్‌ను అధికారులు సీజ్ చేశారు.ఈ ఘటనపై నిందితుడు లోకిని స్వామిపై తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్-1995 ప్రకారం కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ కె. నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది రాజు, సతీష్, రాజేందర్ పాల్గొన్నారు.