కప్పల వాగు పొంగిపొర్లడంతో రైతుల్లో ఆనందం

సిరికొండ, జూలై 29 (జనం సాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు సిరికొండ మండలంలోని కప్పల వాగు పొంగిపొర్లుతోంది. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన రైతులు, ప్రస్తుతం వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కప్పల వాగులో సమృద్ధిగా నీరు చేరడంతో వాగు పరివాహక ప్రాంతాలైన తుంపల్లి, గడ్కోల్, కొండాపూర్, తాళ్ల రామడుగు, కొండూరు, పెద్ద వాల్గొట్, చిన్న వాల్గొట్, పోతునూర్ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం కలుగనుంది. దీంతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు పేర్కొన్నారు. అంతేకాకుండా వాగులో నీటి ప్రవాహం కొనసాగితే పరిసర ప్రాంతాల్లోని బావులు, బోర్లు, చెరువులు నిండడంతో భూగర్భ జలమట్టం కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఆందోళనలో ఉన్న రైతాంగానికి ఈ వర్షాలు, కప్పల వాగు ప్రవాహం కొత్త ఆశలు నింపాయని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సీజన్‌లో పంటలకు ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవని, మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.



