ఒకే ఇంట్లో రక్తపు మడుగులో తండ్రి, కుమారుడు

నల్లగొండ ప్రతినిధి, జూన్ 8 (జనంసాక్షి) : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని సూర్యవంశీ కాలనీలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తండ్రి, కుమారుడు రక్తపు మడుగులో మృతదేహాలుగా కనిపించడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న పబ్బత్తి రెడ్డి లింగరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి (9వ తరగతి విద్యార్థి)గా గుర్తించారు. ఘటన సమయంలో లింగరెడ్డి భార్య, పెద్ద కుమారుడు ఇంట్లో లేరు. వారు తిరిగి ఇంటికి వచ్చి చూడగా లింగరెడ్డి, ప్రణీత్ రెడ్డి విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రణీత్ తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించగా, లింగరెడ్డి పురుగుల మందు సేవించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లింగరెడ్డి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలిలో ఒక సుత్తె లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇది హత్యా? ఆత్మహత్యా? లేక ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, లింగరెడ్డి, ఆయన కుమారుడి మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఘటనతో సూర్యవంశీ కాలనీతో పాటు నల్లగొండ పట్టణం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేస్తున్నాయి.