ఇథనాల్‌ ఫ్యాక్టరీపై సీఎం రేవంత్‌ రెడ్డికి ఫ్యాక్స్‌

రాజోలి (జనంసాక్షి) : పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీల పేరుతో చిచ్చుపెడితే చూస్తూ ఊరుకోమని అలంపూర్‌ ఎమ్మెల్యే విజేయుడు అన్నారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించనున్న ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల చుట్టూ పక్కల గ్రామాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి అని, ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో తేడాలు వస్తాయని అన్నారు. ప్రజలు వద్దని ఇంత వ్యతిరేకత వస్తుంటే ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణం,ప్రజా ఉద్యమం,గ్రామాల వ్యతిరేకతను తెలియచేస్తూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఫ్యాక్స్‌ పంపామని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ వల్ల పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడటమే కాకుండా, సమీపాన ఉన్న తుంగభద్ర నది కలుషితమై తాగునీరు కూడా కలుషితమవుతుందన్నారు. దీనివల్ల ప్రజలకు వివిధ రకాల ఇబ్బందులు ఎదురవుతాయని, ఇబ్బందులు కలిగితే చూస్తూ ఊరుకోమని,పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేతో పాటుగా పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూర్‌, మాన్‌దొడ్డి, తుమ్మిళ్ల, తనగల, చిన్న తాండ్రపాడు, పచ్చర్ల, కేశవరం తదితర గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు.