ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి
నల్లగొండ : ఫ్లోరైడ్ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75) ఇక లేరు. గత నాలుగేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన సొంతూరు శివన్నగూడెంలో తుదిశ్వాస విడిచారు. అంశుల సత్యనారాయణ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఫ్లోరైడ్ రక్కసిపై ఉద్యమాలు చేస్తూనే.. బతుకుదెరువు కోసం సత్యనారాయణ క్షౌర వృత్తితో జీవనం కొనసాగించారు. సత్యనారాయణకు వెంకటమ్మతో వివాహం కాగా తొలుత కుమార్తె జన్మించింది. పుట్టుకతోనే ఫ్లోరైడ్ బాధితురాలు కావటంతో ఆమె ఏడేళ్ల వయసులో మృతి చెందింది. కుమారుడు స్వామి కూడా పుట్టుకతో ఫ్లోరైడ్ బాధితుడు. స్వామి 2022, జనవరిలో మృతి చెందాడు. మూడో సంతానమైన రాజేశ్వరికి ఫ్లోరైడ్ లక్షణాలు రాకపోవడంతో ఆమెకు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. శివన్నగూడెం గ్రామంలో 4,970 మంది ఉండగా, 320 మంది ఫ్లోరైడ్ పీడితులు ఉన్నారు. ఫ్లోరైడ్‌తో బాధపడుతూ ఇప్పటి వరకు 30 మంది మృతిచెందారు. కుమారుడు స్వామితో కలిసి 35 ఏళ్లుగా ఫ్లోరైడ్ రక్కసిపై వివిధ రూపాల్లో సత్యనారాయణ ఉద్యమించారు.