మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఉదారత

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోలు గ్రామానికి చెందిన ప్రహర్ష చిన్నతనం నుంచి చదువులో రాణిస్తోంది. తాజాగా నీట్‌లో మంచి ర్యాంకు సాధించడంతో పాటు నారాయణపేట మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు కూడా దక్కించుకుంది. కానీ ఫీజులు చెల్లించేందుకు కూడా ప్రహర్ష కుటుంబం దగ్గర డబ్బులు లేవు. దీంతో ఆర్థిక సాయం కోరుతూ ప్రహర్ష తల్లిదండ్రులు ఇటీవల సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ప్రహర్ష గురించి పూర్తి వివరాలు ఆరా తీశారు. అనంతరం తమ ఎంజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రహర్ష కుటుంబసభ్యులను పిలిపించుకుని ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ఫీజు రూ.75వేలను అందజేశారు. మిగతా సంవత్సరాల ఫీజును కూడా తన ట్రస్టు ద్వారానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు.