పసిడి జోరు: మూడేళ్లలో రెండింతలు పెరిగిన బంగారం ధర
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. 2025 ప్రారంభం నుంచి పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ కాంట్రాక్ట్ బంగారం ధర రూ. 1,666 (1.69 శాతం) పెరిగి, తొలిసారిగా రూ. 1,00,500 మార్కును తాకి చరిత్ర సృష్టించింది.స్పాట్ మార్కెట్‌లోనూ 10 గ్రాముల బంగారం ధర రూ. 99,000 సమీపంలో ట్రేడవుతోంది. 2022 జులైలో ఈ ధర రూ. 50,000 వద్ద ఉంది. మూడేళ్ల వ్యవధిలోనే బంగారం ధర రెట్టింపు కావడం గమనార్హం.2022 అక్టోబరులో ఔన్స్ బంగారం ధర 1,704 డాలర్లు ఉండగా, 2025 ఏప్రిల్ 22 నాటికి అది 3,470 డాలర్లకు చేరింది. దాదాపు రెండున్నరేళ్లలోనే ధర రెట్టింపు అయింది.ఈ అసాధారణ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో నెలకొన్న విభేదాలు తాజా పెరుగుదలకు ఆజ్యం పోశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం రిస్క్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి అయిన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.గత కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య వివాదాలు, డాలర్ విలువ క్షీణించడం, అమెరికా ట్రెజరీల అమ్మకాలు వంటి అంశాలు కూడా పసిడి పెరుగుదలకు కారణమయ్యాయి. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా చైనా, పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వలను పెంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతోంది.