భగాయత్‌లో చిన్నారుల ట్రాఫిక్ శిక్షణ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్

రూ.1.80 కోట్లతో 2,600 గజాల స్థలంలో ఏర్పాటు పరమేశ్వర్ రెడ్డి కృషి ఫలితం

ఉప్పల్, జూలై 12 (జనం సాక్షి): ఉప్పల్ నియోజకవర్గంలోని భగాయత్ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అభివృద్ధి కానుకను అందించనుంది. రూ.1.80 కోట్ల వ్యయంతో 2,600 గజాల విస్తీర్ణంలో అత్యాధునిక చిన్నారుల ట్రాఫిక్ శిక్షణ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులతో పాటు స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.ఈ పార్క్ ఏర్పాటుకు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి చేసిన నిరంతర కృషి ఫలించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. భగాయత్ ప్రాంతంలో ట్రాఫిక్ శిక్షణ పార్క్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన పలుమార్లు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఆయన చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు, స్థలాన్ని మంజూరు చేసింది.పార్క్ పూర్తయిన తర్వాత పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలు, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అలాగే పార్క్‌లో నమూనా రహదారులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, జంక్షన్లు, జీబ్రా క్రాసింగ్‌లు, పాదచారుల మార్గాలను ఏర్పాటు చేసి పిల్లలకు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నారు. రహదారిని ఎలా సురక్షితంగా దాటాలి, ట్రాఫిక్ సిగ్నళ్లను ఎలా పాటించాలి, వాహనాల రాకపోకల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ప్రాక్టికల్ విధానంలో నేర్పించనున్నారు.ఈ పార్క్ ద్వారా చిన్నారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నిబంధనల పట్ల చిన్నారుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఈ ట్రాఫిక్ శిక్షణ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

తాజావార్తలు