గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్లను ఇప్పటికే సింగిల్ బెంచ్ కొట్టివేయగా.. వారు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో యథావిధిగా సోమవారం నుంచి తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి.. ఈనెల 15వ తేదీన తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పు వచ్చిన రెండు రోజుల తర్వాత అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కారు. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.