గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయికి చెందిన కనకరాజు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు వివిధ దవాఖానల్లో చికిత్స చేయించారు.శుక్రవారం సాయంత్రం ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. గుస్సాడీ నృత్య గురువుగా పేరుగాంచిన కనకరాజు వందలాది మంది యువకుల కు తన కళను నేర్పించారు. దేశవ్యాప్తంగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ 9న ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఆదివాసీ గోండుల గుస్సాడి నృత్యానికి వన్నెతెచ్చిన గుస్సాడి కనకరాజు మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కనకరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఆయన కృషిని గుర్తించిన నాటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం తగురీతిలో ప్రోత్సహించి సతరించిందని వారు గుర్తుచేసుకున్నారు. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి దేశవ్యాప్త ఖ్యాతి ని తెచ్చారని కీర్తించారు. ఎర్రకోటపై తన నృత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింభించారని కేటీఆర్ గుర్తుచేశారు. గుస్సాడి నృత్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారుడు కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం పట్ల సీఎం తీవ్రం సంతాపం ప్రకటిస్తూ.. వారి కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కనకరాజు అంత్యక్రియలు స్వగామమైన మార్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.