నేడు ఘోష్ కమిషన్‌పై హైకోర్టు విచారణ
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కెసిఆర్ పిటిషన్‌ను హైకోర్టు విచారణక స్వీకరించింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6ను కూడా అందులో సవాలు చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌ను పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లలో పేర్కొన్నారు.