రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం

-మునిసిపల్ కమీషనర్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, జూలై 22(జనంసాక్షి): పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలివేయడంపై క్యాతనపల్లి పురపాలక సంఘం కఠిన హెచ్చరిక జారీ చేసింది. రోడ్లపై సంచరిస్తున్న పశువుల కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండటంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్యాటనపల్లి మునిసిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. పట్టణంలో పశువులను యథేచ్ఛగా రోడ్లపై వదిలివేయడం వల్ల ఇప్పటికే పలు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశువుల యజమానులు ఈ పత్రికా ప్రకటన వెలువడిన తేదీ నుంచి మూడు రోజుల్లోగా తమ ఆవులు, గేదెలను ఇంటి ఆవరణలో లేదా తగిన షెడ్లలో ఉంచుకుని సంరక్షించాలని సూచించారు. నిర్దేశించిన గడువు అనంతరం కూడా రోడ్లపై సంచరిస్తూ కనిపించే పశువులను మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక బృందాల ద్వారా స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. అనంతరం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై జరిమానాలు విధించే అవకాశమూ ఉంటుందని హెచ్చరించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సజావుగా సాగడం, ప్రజల భద్రతను కాపాడడం లక్ష్యంగానే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పశువుల యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మున్సిపాలిటీకి సహకరించాలని, ప్రజలందరూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.



