పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం

 

సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో రాష్ట్రంలో విద్యావ్యస్థ నిర్వీర్యమైందని విద్యార్థులు విమర్శించారు. ఫిజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకపోవడంతో చాలా కాలేజీలు మూతపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని చెప్పారు. విద్యాశాఖను మీ వద్దే ఎందుకు ఉంచుకున్నారంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. పెండింగ్‌ బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి రావడానికి తాము ఎంతో కష్టపడ్డామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన విద్యాశాఖను గాలికి వదిలేశారంటూ విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌ విద్యాశాఖపై దృష్టి పెట్టాలన్నారు. కంచెలు తొలగించామని చెప్పుకుంటున్నారని, కానీ నిరసనకారులను పోలీసులతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.