ఆ స్టార్ ప్రొడ్యూసర్ లైఫ్ లో రాజావారి కూతురు .. మేనమామ కూతురు!

వీబీ రాజేంద్రప్రసాద్ .. అనే పేరు వినగానే ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్ గుర్తుకు వస్తుంది. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. అలాంటి ఆయన లైఫ్ లోని ఒక లవ్ స్టోరీని గురించి, ట్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ తో దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు.” వీబీ రాజేంద్రప్రసాద్ గారు కాలేజ్ చదువు ‘కాకినాడ’లో జరిగింది. అదే కాలేజ్ లో ‘పిఠాపురం’ రాజావారి పిల్లలు చదువుకునేవారు. కాలేజ్ లో చదువుకునే రోజుల నుంచే రాజేంద్ర ప్రసాద్ గారికి డబ్బుకు లోటు ఉండేది కాదు. అందువలన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా రోజులు గడిపేస్తూ ఉండేవారు. రాజావారి అమ్మాయిలలో ఒకరితో ఆయన ప్రేమలో పడ్డారు. అప్పట్లో కాలేజ్ గోడలపై వాళ్ల పేర్లను రాశారు కూడా” అని అన్నారు. ” ఈ విషయం రాజావారి వరకూ వెళ్లింది. ఆయన ఏమంటారోనని రాజేంద్రప్రసాద్ గారు భయపడ్డారు. అప్పటికే రాజేంద్రప్రసాద్ గారి మంచితనం గురించి తెలిసిన ఆయన, తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. వెంటనే రాజేంద్రప్రసాద్ గారు తన ఇంటికి వచ్చి, జరిగిన విషయం గురించి చెప్పారు. తాను మాట ఇచ్చాను గనుక రాజావారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారు” అని చెప్పారు. ” అయితే రాజేంద్రప్రసాద్ గారిని ఆయన అన్నయ్య వారించారు. చాలా కాలం క్రితమే మేనమామ ఫ్యామిలీకి తమ ఫ్యామిలీ ఇచ్చిన మాటను గుర్తుచేశారు. ఆస్తులు కోల్పోయిన ఆ ఫ్యామిలీకి తమ అవసరం ఉందని చెప్పారు. మేనమామ కూతురు రాజేంద్ర ప్రసాద్ ను భర్తగా భావిస్తోందని నచ్చజెబుతారు. దాంతో ఆయన మనసు మారిపోయింది. రాజావారి అమ్మాయికి నచ్చజెప్పి, మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నారు” అని చెప్పారు.