టీచర్ల భర్తీలో అక్రమాలు

చర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్‌టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని.. తమకు పలు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తీ చేయకపోవడంపై జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని చెప్పారు.ఎస్‌టీ కేటగిరీయే కాకుండా అన్ని కేటగిరీల్లోనూ హైదరాబాద్‌ సంబంధిత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. టీచర్ల భర్తీ ప్రక్రియపై విచారణ జరిపి రీ వెరిఫికేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్టిఫికెట్లను సరిగా పరిశీలించకుండానే టీచర్ల భర్తీ జరిగిందన్నారు. టీచర్ల భర్తీపై విచారణ చేసి హైదరాబాద్‌ స్థానిక అభ్యర్థులమైన తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు డీఎస్సీ అభ్యర్థులు సుజాత, లలిత, అరుణ, సంగీత, గోవింద్‌ సింగ్‌ తదితరులు మొరపెట్టుకున్నారు.కాగా హైదరాబాద్‌ టీచర్ల భర్తీలో అవకతవకలు జరిగినట్టు వార్తలు రావడంతో హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి భర్తీ ప్రక్రియపై స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. సదరు డీఈఓ, డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్‌ల నుంచి వివరాలు సేకరించి.. కలెక్టర్‌కు రిపోర్ట్‌ అందించినట్టు ప్రత్యేక అధికారి జ్యోతి తెలిపారు. అయితే ఈ రిపోర్ట్‌ను కలెక్టర్‌ పరిశీలించిన అనంతరం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఉండనున్నాయి. హైదరాబాద్‌లో డీఎస్సీ 2024లో 584 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇచ్చారు. 878 పోస్టులకు గాను కోర్టు కేసులు, రిజర్వేషన్‌ కేటగిరీలో అభ్యర్థుల కొరత, ఇన్‌ సర్వీస్‌ తదితర కారణాలతో 262 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి.