బస్టాండా ..? బురదమైదానమా..?

వర్షానికే వణికిన ఉప్పల్ తాత్కాలిక బస్‌స్టాండ్‌..!

బురదలో దిగబడిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు.. జేసీబీతో బయటకు

ప్రయాణికులకు తప్పని అవస్థలు.. కనీస సౌకర్యాలపై ప్రశ్నలు

ఉప్పల్, ఆగస్టు 3 (జనం సాక్షి): ఉప్పల్ నల్లచెరువు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ప్రయాణికులకు నిత్య సమస్యగా మారింది. వర్షాలు కురవడంతో బస్‌స్టాండ్‌ ప్రాంగణం మొత్తం బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బురదలో చిక్కుకోవడంతో పరిస్థితి మరోసారి బట్టబయలైంది. సోమవారం తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బురదలో దిగబడిపోయింది. బస్సును బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు జేసీబీ సహాయంతో బస్సును బయటకు తీశారు. దీంతో తాత్కాలిక బస్‌స్టాండ్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితిపై ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం ఈ తాత్కాలిక బస్‌స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ వరంగల్, జనగామ, తొర్రూరు, యాదాద్రి తదితర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు ఈ బస్‌స్టాండ్‌ను వినియోగిస్తున్నారు. అయితే వర్షాకాలంలో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. బురదలోనే నడుచుకుంటూ బస్సులు ఎక్కాల్సి రావడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జారిపడి ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “బస్‌స్టాండ్‌ పరిస్థితి చూస్తుంటే ప్రయాణ ప్రాంగణంలా కాకుండా బురదమైదానంలా మారింది” అంటూ పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద కారణంగా ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు కదలలేని పరిస్థితులు ఏర్పడటంతో సమయపాలనపై కూడా ప్రభావం పడుతోందని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బురద తొలగించి, కంకర లేదా పేవర్ బ్లాకులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ఆధారపడుతున్న ఉప్పల్ తాత్కాలిక బస్‌స్టాండ్‌ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. వర్షాలు మరింత పెరిగే ముందే సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజావార్తలు