సింగరేణిని కాపాడింది బీజేపీయే..!

— భట్టి విక్రమార్క వాస్తవాలు గుర్తు చేసుకుని మాట్లాడాలి
— విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్‌రెడ్డి
మంథని జూలై 15, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని లోని రామ్‌రెడ్డి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంథని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి భవిష్యత్తు, కార్మికుల సంక్షేమం, మంథని అభివృద్ధే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ప్రజల్లో కొత్త ఆశలను నింపిందన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్న ఈ యాత్ర సింగరేణి కార్మికులు, మంథని ప్రజల్లో భరోసా కల్పించిందన్నారు.
మంథని ప్రాంతానికి బొగ్గు, గోదావరి జలాలు, ఇసుక వంటి అపార సహజ వనరులు ఉన్నప్పటికీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేక అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. కాళేశ్వరం, సింగరేణి వంటి కీలక వనరులు మంథనితో ముడిపడి ఉన్నప్పటికీ స్థానిక యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించలేదని తెలిపారు. మంథని నుంచి మంత్రులు, స్పీకర్లు, దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నాయకులు ఉన్నప్పటికీ మంథని అభివృద్ధిలో ఆశించిన పురోగతి కనిపించలేదని విమర్శించారు. ఇంతటి రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ మంథని అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు లక్షా నలభై వేల నుంచి లక్షా యాభై వేల మంది ఉద్యోగులు పనిచేసిన సింగరేణిలో ప్రస్తుతం సుమారు 35 వేల మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ సింగరేణిని బలోపేతం చేయకుండా ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. జెన్‌కో సహా ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణిపై ఆర్థిక భారం పెరిగి కార్మికుల జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లపై ప్రభావం పడిందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2013 తర్వాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుని మాట్లాడాలని సూచించారు. 2013-14లో వెలుగులోకి వచ్చిన బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం అనంతరం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పాత కేటాయింపులను రద్దు చేసి, బొగ్గు గనుల కేటాయింపులు వేలం విధానం ద్వారానే జరగాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బ్లాక్–2ను ఎలాంటి ప్రైవేట్ టెండర్లు లేకుండా నేరుగా సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మంథని బీజేపీ నాయకుల విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి సింగరేణికి కేటాయింపు జరిగేలా కీలక పాత్ర పోషించారని తెలిపారు. తాడిచెర్ల బ్లాక్–2 కేటాయింపుతో మైనింగ్ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. మంథని కూడా రామగుండం, భూపాలపల్లి, మంచిర్యాల తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఈ నిర్ణయంతో ఏర్పడిందని పేర్కొన్నారు. ఏఎమ్మార్ సంస్థ స్థానిక ప్రజల భూములు తీసుకున్నప్పటికీ ప్రాంతీయ యువతకు తగిన ఉద్యోగాలు కల్పించడం లేదని ఆరోపించారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని పలుమార్లు కోరినా సంస్థ స్పందించడం లేదని, ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణిని కాపాడటం, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మంథని అభివృద్ధికి కృషి చేయడం భారతీయ జనతా పార్టీ లక్ష్యమని చందుపట్ల సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, సిలివేరి సతీష్, లక్ష్మణ్, అశోక్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.



