కొండమల్లేపల్లి పశువుల సంత వేలం 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి

 

 

 

బహిరంగ వేలంలో గుత్తేదారుల మధ్య హోరాహోరీగా పోటీ

రికార్డు స్థాయిలో వేలం దక్కించుకున్న వర్కాల భాస్కర్ రెడ్డి

కొండమల్లేపల్లి, మార్చి 26(జనంసాక్షి):

కొండమల్లేపల్లి మేజర్ గ్రామపంచాయతీ పశువుల సంత బహిరంగ వేలం రికార్డు స్థాయిలో పలికింది.బుధవారం గ్రామపంచాయతీ ఆవరణంలో ఇన్చార్జ్ డిపిఓ శంకర్ నాయక్ సమక్షంలో పశువుల సంత బహిరంగ వేలం నిర్వహించారు. కొండమల్లేపల్లి పశువుల సంత బహిరంగ వేలంలో 25 మంది సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఇంచార్జ్ డిపిఓ శంకర్ నాయక్ బహిరంగ వేలం నియమ నిబంధనలు వివరించి వేలంలో పాల్గొన్న 25 మందికి సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సమక్షంలో కొండమల్లేపల్లి పశువుల సంత సర్కారీ వేలంపాట ఒక కోటి 26 లక్షల 60 వేల 43 రూపాయలను మద్దతు ధర ప్రకటించారు. అనంతరం వేలంలో పాల్గొన్న 25 మంది హోరా హోరిగా సంతను కైవసం చేసుకునేందుకు వేలం పాట పాడారు. అంచనాలకు మించి వేలంపాట ధర పెరుగుతుండడంతో అధికారులు నెవ్వర పోయారు 25 మందిలో ముఖ్యంగా వర్కాల భాస్కర్ రెడ్డి కల్వకుర్తి, బొమ్ము తిరుపతయ్య కాచరాజుపల్లి, జాల సైదులు నార్కట్పల్లి, కొమ్మగోని కృష్ణయ్య గౌడ్ తర్ణికల్ నలుగురు మధ్య హోరాహోరీగా వేలంపాట కొనసాగింది. సుమారు రెండు గంటల పాటు వేలంపాట జరిగింది. చివరగా కల్వకుర్తి పట్టణానికి చెందిన వర్కాల భాస్కర్ రెడ్డి పశువుల సంతను బహిరంగ వేలంలో 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి రూపాయలతో కొండమల్లేపల్లి సంతను దక్కించుకున్నాడు. బొమ్మ తిరుపతయ్య 3 కోట్ల 80 లక్షలతో రెండవ స్థానంలో ఉన్నాడు. బహిరంగ వేలం పాటలో కొండమల్లేపల్లి పశువుల సంతను దక్కించుకున్న గుత్తేదారు వర్కాల భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 1 2026 నుండి మార్చి 31 2027 వరకు అనగా ఒక సంవత్సరం పాటు పశువుల సంత నిర్వహణ నూతన గుత్తేదారు వర్గాల భాస్కర్ రెడ్డి ఆధీనంలో ఉంటుందని అధికారులు ప్రకటించారు. సంతను దక్కించుకున్న వర్గాల భాస్కర్ రెడ్డి 1/4 వంతు డబ్బులు ఏడు రోజులలో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూపాయలు 9 నెలలకు సరిపడా కిస్తులలో డిసెంబర్ 31 2026 నాటికి పూర్తి అయ్యే విధంగా చెల్లించాలి. ముందస్తు సంతకం చేసిన 9 అడ్వాన్స్ చెక్కులు గ్రామపంచాయతీ కార్యదర్శి పేర ఇవ్వాలి. లేని యెడల 2 శాతం అపరాధ రుసుము వసూలు చేస్తారు. అనంతరం బహిరంగ వేలంలో పశువుల సంతను సొంతం చేసుకున్న గుత్తేదారు వర్గాల భాస్కర్ రెడ్డిని అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం అభినందించి నియామక పత్రం అందించారు. పశువుల సంత వేలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీర రమేష్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నరేందర్, ఇంచార్జ్ ఎంపిడిఓ సుధీర్ కుమార్, మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ డాకు నాయక్, సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొడిదాల పద్మ వెంకటయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.