అభ్య‌ర్థుల‌తో కేటీఆర్ స‌మావేశం

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గ్రూప్ -1 అభ్య‌ర్థులు స‌మావేశ‌మ‌య్యారు. గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు వాయిదా వేసేలా స‌ర్కార్‌పై ఒత్తిడి తేవాల‌ని కేటీఆర్‌కు అభ్య‌ర్థులు విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థుల స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్ విన్నారు. అయితే గ్రూప్-1 మెయిన్స్‌ను రీ షెడ్యూల్ చేయాల‌ని గ‌త కొద్ది రోజుల నుంచి అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ‘వీ వాంట్‌ జస్టిస్‌’ అంటూ గర్జించారు. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో దొర్లిన తప్పులను, జీవో 29ని సవరించిన తర్వాతే మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై ఉక్కుపాదం మోపారు. పలువురు అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి బేగంబజర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా పలువు అభ్యర్థులు మాట్లాడుతూ జీవో 29, జీవో 55పై ఎటూ తేల్చకుండా, తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా ఆగమేఘాల మీద గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమో? కాదో? చెప్పకుండా ప్రశ్నల్లో తప్పులు దొర్లకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వకుండా, తెలుగు అనువాదం సరిగ్గా ఇస్తారా? లేదా? చెప్పకుండాపరీక్షలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఇవ్వన్నింటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే గ్రూప్‌-2, 3 పరీక్షలు పెట్టలనుకోవడం కూడా నిరుద్యోగులను నిండా ముంచడమేనని మండిపడ్డారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై సుమారు 33 కేసులు దాఖలయ్యాయని, అవన్నీ పరిష్కారమైన తర్వాతే మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-1 పరీక్షలు 2011లోనూ నిర్వహించి రద్దు చేశారని, 2016లో తిరిగి నిర్వహించారని గుర్తుచేశారు. మెయిన్స్‌ పరీక్షల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌లో అన్ని ప్రశ్నలూ తప్పులతడకలేని, 150 ప్రశ్నలకు 20 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని గుర్తుచేశారు. ఈ కేసులన్నీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.