తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

తిరుమల (జనంసాక్షి): ఇటీవల తిరుమలలో చిరుతల‌ సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారులు త‌క్ష‌ణ‌మే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిరుతను పట్టుకునేందుకు తిరుపతి వేదిక్ విశ్వ‌విద్యాల‌యం వ‌ద్ద‌ ఓ బోన్‌ ఏర్పాటు చేశారు. అక్కడ చిరుత చిక్కింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో భ‌క్తులు భయాందోళనకు గుర‌వుతున్నారు. జూపార్క్‌ రోడ్డు నుంచి తిరుమల టోల్‌ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళుతూ కనిపించింది. చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. కాగా, చిరుతల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయడానికి ఏపీ అటవీ శాఖ అధికారులు రెడీ అవుతున్నార‌ని తెలిసింది. శాటిలైట్‌, అధునాతన కెమెరాలు, జీపీఎస్‌ వంటి టెక్నాల‌జీ వ్యవస్థలతో చిరుతల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అటవీ మ్యూజియం ఉన్న భవనంలోనే ఈ సెల్‌ను ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం.

తాజావార్తలు