జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): “జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం” అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన ఆశయాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సేవలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాను “జయశంకర్ భూపాలపల్లి జిల్లా”గా నామకరణం చేసిందన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 6న రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.