మే 14న మిస్ వరల్డ్ టీం రాక

ములుగు ప్రతినిధి, (జనంసాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం మే 14న రాబోతున్నదని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరిష్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావులతో కలిసి రామప్పలో ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే 14వ తేదీన ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొననున్న పలు దేశాలకు చెందిన పోటీ మహిళలు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను సందర్శించనున్న నేపథ్యంలో నేషనల్ హైవే లోని రోడ్డు పనులు మహమ్మద్ గౌస్ పల్లి నుండి జంగాలపల్లి వరకు, జంగాలపల్లి నుండి రామప్ప టెంపుల్ వరకు ఆర్ అండ్ బి రోడ్డు, రామప్ప దేవాలయం నుండి హరిత హోటల్ వరకు పంచాయతీ రాజ్ రోడ్డు, ఇంజనీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి రోడ్డు మరమ్మత్తు పనులను ఈనెల 30వ తారీకు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పాలంపేట లోని రామప్ప దేవాలయం స్వాగత ఆర్చ్ పెయింటింగ్ చేసి సుందరికరించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. హరిత కాటేజ్ లను పెయింటింగ్ తో సుందరికరించాలని, ఈ పర్యటనకు సంబంధించి అధికారులతో వాట్సాప్ గ్రూప్ తయారుచేయాలని టూరిజం అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఫోటోలు వాట్స్ అప్ గ్రూప్లో పోస్ట్ చేయాలని త్వరలో ఫీల్డ్ విజిట్ చేస్తానని, ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని, సమన్వయంతో అధికారులు ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీఎస్పీ రవీందర్, పురావస్తు శాఖ అధికారులు, జిల్లా అధికారులు, వెంకటాపూర్ మండలాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు