నిబద్ధత గల పాత్రికేయుడు మునీర్‌ : ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : సీనియర్‌ పాత్రికేయుడు ఎండి మునీర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. వృత్తి పట్ల నిబద్ధత, సామాజిక ఉద్యమాల పట్ల అంకితభావం కలిగిన మునీర్‌ మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వివిధ పత్రికల్లో పనిచేసిన మునీర్‌ సింగరేణికి సంబంధించి ఎన్నో విషయాల్లో ప్రజలను చైతన్య పరిచారన్నారు. ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా మునీర్‌ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సహా పలువురు పేర్కొన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేని లోటు సింగరేణి ప్రాంతంలో పూడ్చలేనిదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణకు తీరని లోటు : సింగరేణి సీఎండీ ఎన్‌ బలరామ్‌
సింగరేణి మాజీ ఉద్యోగి, సీనియర్‌ జర్నలిస్ట్‌, తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెలో సింగరేణి విభాగానికి కన్వీనర్‌గా, పలు సమాజ హిత ఉద్యమాలలో కీలక భూమిక పోషించిన మునీర్‌ మరణం పాత్రికేయ రంగానికే గాక తెలంగాణ సమాజానికి తీరని లోటని సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు. మునీర్‌ పాత్రికేయుడిగా పనిచేస్తూ, కార్మిక పక్షపాతిగా అనేక సింగరేణి కార్మిక సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారని, చివరి వరకు పాత్రికేయులుగానే కొనసాగుతూ అనేక సామాజిక అంశాలను విశ్లేషిస్తూ ప్రజాసేవ చేశారన్నారు. ఆయన అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.