విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం దుర్మార్గం.. కాంగ్రెస్ నాయకులపై బీఆర్‌ఎస్ మండిపాటు
మిడ్జిల్: జూన్ 9. ( జనం సాక్షి) మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మన్యం వెంకట్‌రెడ్డి విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం ఏర్పాట్లు చేయగా, అధికారులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి సాయన్న, తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాసులు, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన స్థలానికి చేరుకుని అనుమతులు లేవని చెప్పడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు అధికారులను ప్రశ్నించాయి. గ్రామంలో ఇప్పటికే పలు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు మాత్రమే గుర్తుకు రావడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రజాభిమానాన్ని చూసి భయపడుతున్నారని, అందుకే వెంకట్‌రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన నాయకుల విగ్రహాలను సైతం సహించలేని స్థితికి కాంగ్రెస్ నాయకులు దిగజారారని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు నచ్చజెప్పడంతో అనుమతులు వచ్చిన తర్వాతే శంకుస్థాపన చేపడతామని ప్రకటించారు. అలాగే వెంకట్‌రెడ్డి విగ్రహంతో పాటు మాజీ సర్పంచ్‌లు ఎలుగొండ శివకుమార్‌రెడ్డి, కమ్మరి సాయిబాబా విగ్రహాల ఏర్పాటుకు కూడా అనుమతులు కోరుతూ దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుచూరి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మన్యం బాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ జెడ్పీటీసీ శశిరేఖ బాలు, గంజి కృష్ణ, నారాయణ్‌రెడ్డి, జంగారెడ్డి, జగన్ గౌడ్, శేఖర్, కరుణాకర్‌రెడ్డి, రాఘవేందర్, భాస్కర్ నాయక్, తిరుపతినాయక్, సురేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



