పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కుటిల బుద్ధి!

గద్వాల (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పదుల సంఖ్యలో గ్రామాలు ఉద్యమం చేస్తున్న విషయం విధితమే. పెద్దఎత్తున ఎగిసిన వారి తిరుగుబాటు నేపథ్యంలో పనులు చేయబోమని చెప్తూనే ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం కుటిల బుద్ధి బయటపెట్టుకుంది. గుట్టుచప్పుడు కాకుండా పోల్స్‌ పాతడానికి శనివారం అక్కడికి చేరుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, రైతులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అక్కడికి తీసుకొచ్చిన వాహనాలకు అడ్డుగా నిలిచారు. రోడ్డుపైనే బైటాయించి ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేక నినాదాలు చేశారు. పనులు ఆపినట్టే ఆపి గుట్టుచప్పుడు కాకుండా మొదలు పెట్టేందుకు యత్నిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలైనా అడ్డుపెడతాం కానీ.. ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో పెద్ద ధన్వాడ గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పనులు ప్రారంభిస్తున్న విషయం తెలుసుకుని రాజోలి, అయిజ మండలంలోని పలు గ్రామాలు మళ్లీ ఆందోళన బాటపడుతున్నాయి.