పాక్ ఉప ప్ర‌ధాని వ్యాఖ్య‌లు… ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లే ఉన్నాయి: డానిష్ కనేరియా

పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన వారి విష‌యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ఈ పాశ‌విక‌ దాడికి పాల్పడిన వారిని ఆయన స్వాతంత్ర్య సమరయోధులు కావొచ్చ‌ని పేర్కొన్నారు.అయితే, ఆయ‌న చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ఆ దేశ‌ మాజీ క్రికెట‌ర్ దానిష్ కనేరియా స్పందించారు. ఉగ్ర‌వాదుల‌ను స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌తో పోల్చ‌డం దారుణ‌మ‌న్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు నిజంగానే ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లే ఉన్నాయని మండిప‌డ్డారు. ఈ మేర‌కు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. “పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి ఉగ్రవాదులను ‘స్వాతంత్ర్య సమరయోధులు’ అని పిల‌వ‌డం దారుణం. అది అవమానకరం మాత్రమే కాదు… పాక్ సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న‌ట్లుగా బహిరంగంగా అంగీకరించడం” అని క‌నేరియా ధ్వ‌జ‌మెత్తారు. ఇక‌, ఇప్ప‌టికే ఈ మాజీ క్రికెట‌ర్ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ఉగ్ర‌దాడిలో నిజంగా పాకిస్థాన్ పాత్ర లేక‌పోయి ఉంటే ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ ఇంకా ఎందుకు ఖండించ‌లేద‌ని క‌నేరియా నిల‌దీశారు. బ‌ల‌గాలెందుకు హై అల‌ర్ట్‌లోకి వెళ్లాయంటూ ప్ర‌శ్నించారు. పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారిని పెంచి పోషిస్తున్నందుకు సిగ్గు ప‌డాల‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

తాజావార్తలు