ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన పెద్దవాల్గొట్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి

శాలువాతో ఘన సన్మానం.. గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని వినతి
సిరికొండ, జూలై 28 (జనం సాక్షి): పెద్దవాల్గొట్ గ్రామ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ పెద్దవాల్గొట్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్దవాల్గొట్ గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామానికి అవసరమైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. వినతిని సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గ్రామ ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్దవాల్గొట్ గ్రామ సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ రావు, ఉపసర్పంచ్ రాము, సాయిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బకారం రవి, డీసీసీ కార్యదర్శి గొల్ల ఎర్రన్న, చందర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



