పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):

– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు..
– తహసీల్ ఆఫీస్ ముందు ధర్నా..

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ కోసం స్థానిక తహసీల్ ఆఫీస్ ఎదుట విద్యార్థులు అందరితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ గడచిన ఆరు సంవత్సరాలలో స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్ల పైన ఉండటం వల్ల ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. గత ఆరేళ్లుగా సమస్యలు పట్టించుకోనందున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వేలకు వేలు ఫీజులు కట్టే పరిస్థితి లేక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోమాస నరేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిటీ కార్యదర్శి నిఖిల్, సంఘమిత్ర డిగ్రీ కళాశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.