బీఎస్పీ పార్టీకి పూర్ణచందర్‌ రావు రాజీనామా

హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : బహుజన్‌ సమాజ్‌ పార్టీకి మరో కీలక నేత, రిటైర్డ్‌ డీజీపీ డాక్టర్‌ జె పూర్ణచందర్‌ రావు ఐపీఎస్‌ రాజీనామా చేశారు. పార్టీలో కొన్ని వ్యవహారాలు నచ్చక తాను మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మాయావతికి ఓ లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి.
గౌరవనీయులైన బెహెన్‌జీ,
జై భీమ్‌, జై ఫూలే !
డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ రచించిన ‘కుల నిర్మూలనం’ పుస్తకాన్ని చదివిన తర్వాత, కుల వివక్ష ప్రజాస్వామ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో లోతుగా అర్ధం చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి మరియు కమ్మ వర్గాల ఆధిపత్యం కొనసాగుతుందని గ్రహించాను. వారు రాష్ట్ర జనాభాలో 8% ఉన్నప్పటికీ, అసెంబ్లీలో 44% ఎమ్మెల్యే స్థానాలను ఆక్రమించారు. ఇక 52% జనాభా ఉన్న బీసీలు కేవలం 20% ఎమ్మెల్యే స్థానాలను పొందారు. రెడ్డి మరియు కమ్మ జనాభా సంఖ్యతో సమానంగా ఉన్న ముస్లింలు అయితే 2% ఎమ్మెల్యేలను కూడా పొందలేకపోయారు. ఇది బీసీలకు మరియు ముస్లింలకు ఇంకా సరిగ్గా అవగతం గాని ఆందోళనకర పరిస్థితి.
నేను, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), మాన్యవర్‌ కాంశీరామ్‌ స్వప్నాన్ని నెరవేరుస్తుందని నమ్మాను. అయితే, బహుజనుల రాజకీయ ఉద్యమాన్ని బలహీనపరిచే కమ్మ రెడ్డి నాయక పార్టీల రాజకీయ వ్యూహాలను ఎదిరించాల్సింది పోయి, బీఎస్పీ అంతర్గత వ్యవహారాలలో మునిగి పోయింది. బీఎస్పీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు శ్రీ బక్క పరంజ్యోతి అనూహ్యంగా తొలగించబడటానికి జాతీయ కోఆర్డినేటర్‌ కీలక పాత్ర పోషించారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లో శ్రీ బక్క పరంజ్యోతి ఛంధాగిరీ పాల్పడకుండా నిబద్ధతతో ఉన్నా, బీసీ, ఎస్టీ మరియు ఇతర కుల సంఘాలతో సమావేశాలను హాజరుకావడాన్ని
నిరోధిస్తూ, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సర్క్యులర్‌ పార్టీ ప్రకటించింది. ఫలితంగా ఆయన రాజీనామా చేశారు. తర్వాత మొదటి దక్షిణ భారత బీఎస్పీ ఎమ్మెల్యే (2004-09) శ్రీ లకే రాజారావు కూడా రాజీనామా చేశారు. వారిని తిరిగి నియమించమని నేను పార్టీ సుప్రీమ్‌ మరియు చీఫ్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ ను కోరినా ఫలితం లేకపోయింది. నాలో బహుజనుల అభ్యున్నతి పట్ల నిబద్ధత అచంచలమైనది. మాన్యవర్‌ కాంశీరామ్‌ సూచించిన మార్గాన్ని నేను కచ్చితంగా అనుసరిస్తాను. ఆయన బహుజన్‌ రాజకీయ సాధికారత కోసం, జ్యోతిరావు ఫూలే, శాహు మహారాజ్‌, బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ మార్గదర్శకత్వాన్ని అనుసరించారు. అలాగే పెరియర్‌ మరియు నారాయణ గురు వంటి మహనీయులు బహుజన రాజకీయ అవగాహనకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి, పార్టీ ఆంక్షల నుండి విముక్తి పొందడానికి, బహుజనులకు మేలు చేయడానికి, నేను బీఎస్పీ నుండి మరియు నా పదవి నుండి రాజీనామా చేస్తున్నాను. ఇకపై, మనకు బహుజన సాధికారతను అందించే కొత్త రాజకీయ ఉద్యమాన్ని నిర్మించేందుకు బహుజన నాయకులతో కలిసి ప్రజలను సమీకరించి ముందుకు సాగుతాను.
ఫిబ్రవరి 19 2024 నాడు మిమ్మల్ని కలిసిన నాటి నుండి నాకు బీఎస్పీ లో పని చేసే అవకాశాన్ని కల్పించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. గత సంవత్సర కాలంగా నాపై ఎంతో ఆప్యాయతను అభిమానాన్ని చూపించిన బహుజన మిత్రులందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని నా బహుజన ఉద్యమ ప్రయాణంలో కలుస్తానని భావిస్తూ.. జై కాంశీరామ్‌.. అంటూ ఆయన తన లేఖను ఢల్లీికి పంపారు.