ఉగ్రవాదులకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
జమ్మూకశ్మీర్ (జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా, యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుక కుట్ర పన్నిన వారికి వారి ఊహకు కూడా అందని శిక్ష పడుతుంది. శిక్ష పడి తీరుతుంది. ఉగ్రవాదుల మిగిలిన మూలాలను కూడా మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది,” అని ఆయన ఉద్ఘాటించారు. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్ప శక్తి ఉగ్రవాదుల వెన్ను విరుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడిలో ఈ దాడి పట్ల తీవ్ర బాధ, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ, భారత్‌కు అండగా నిలిచిన అంతర్జాతీయ సమాజానికి, వివిధ దేశాల నాయకులకు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ వెనకడుగు వేయదని, న్యాయం జరిగేలా చూస్తామని ప్రపంచానికి సందేశం ఇచ్చారు. “భారతదేశం ప్రతి ఉగ్రవాదిని, వారి మద్దతుదారులను గుర్తించి, వెంటాడి శిక్షిస్తుంది,” అని బిహార్ వేదికగా ప్రధాని స్పష్టం చేశారు. అంతకుముందు, బిహార్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, దేశ వేగవంతమైన అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ప్రధాని నొక్కి చెప్పారు. ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు ‘వికసిత బిహార్’ నిర్మాణం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.