వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
>రైతులు అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది>జిల్లాలో యూరియా కొరత లేకుండా ఆన్‌లైన్ విధానంలో సరఫరా చేస్తాం>పెద్దాపూర్, లక్ష్మాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
ఉప్పునుంతల జనంసాక్షి : ఉప్పునుంతల మండల పరిధిలోని పెద్దాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.శనివారం కురిసిన భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసిన విషయం తన దృష్టికి వచ్చినందున కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా వెంటనే బాయిల్ మిల్లులకు తరలించాలని, ఇందుకోసం రవాణా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సివిల్ సప్లైస్, ఐకేపీ, మెప్మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం ప్రక్రియ, హమాలీల ఏర్పాటు, రవాణా సదుపాయాలు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాల కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని రక్షించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం రైతులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.



