రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పొద్దంతా తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రానికి వానలు పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సాయంత్రం వానలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో 43.4, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఇల్లంతకుంట, నిజామాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీలు నమోదైంది.