జడ్చర్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం మార్పుకు వినతి

కావేరమ్మపేటలోని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ కు వినతి

జడ్చర్ల, ఆగస్టు 6 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో ప్రైవేట్ అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కావేరమ్మపేటలోని పాత మున్సిపల్ ప్రభుత్వ భవనంలోకి మార్చాలని కోరుతూ స్థానిక జేఏసీ నాయకులు, యువకులు గురువారం జిల్లా కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చవలసి ఉన్నందున, బాదేపల్లి ప్రాంతంలో ప్రైవేట్ అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వల్ల ప్రభుత్వానికి అనవసరమైన అద్దె భారం పడుతోందని అందుకు 44వ జాతీయ రహదారికి పక్కనే, అందరికీ అందుబాటులో ఉన్న కావేరమ్మపేటలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ భవనంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అద్దె భారం తప్పడంతో పాటు, సువిశాలమైన పార్కింగ్ స్థలము, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. జాతీయ రహదారికి ప్రక్కనే ఉండటం వల్ల ప్రజల రాకపోకలకు, రిజిస్ట్రేషన్ పనులకు సౌకర్యవంతంగా ఉంటుందని కార్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. బాదేపల్లిలో అద్దె భవనంలో ఉన్న కార్యాలయాన్ని కావేరమ్మపేటలోని పాత మున్సిపల్ ప్రభుత్వ భవనంలోకి షిఫ్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో జడ్చర్ల, కావేరమ్మపేట జె.ఎ.సి నాయకులు, స్థానిక యువకులు పాల్గొన్నారు.