ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాం
` ఉద్యోగ,ఉపాధి అంశాలే కీలకం
` ఐటీఐలను ఆధునీకరిస్తాం
` ఇకపై వీటిని ఐటీసీలుగా మారుస్తున్నాం
` ఆధునిక శిక్షణతో యువతకు ఉపాధి కల్పిస్తాం
` టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పదేళ్లకు ఒప్పందం
` ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
` మల్లేపల్లి ఐటీఐ అధునీకరణ కేంద్రానికి శంకుస్థాపన
హైదరాబాద్(జనంసాక్షి): మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘’తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయి.నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వాటిని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలనే నిర్ణయించాం. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి విలువైన కాలాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టాం. నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజినీరింగ్ గ్రాడుయేట్స్ వచ్చి రూ.15 వేలు, రూ.20 వేలకు పనిచేస్తామని వచ్చారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే రూ.60 వేలు అడిగారు.సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచడం లేదని అప్పుడే అర్థమైంది. అందుకే ఎంతోమంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తాం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నాం. ఈ ప్రయత్నంలో తోడ్పడేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం నలుమూలలా 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం. ముఖ్యమంత్రిగా నేను ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తా. ప్రతి నెలా సవిూక్ష చేస్తా’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునికీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.2,324.21 కోట్ల నిధులు ఖర్చుచేయనుంది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ అప్‌గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చనుంది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించింది. ఏటా 15, 860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్ కోచింగ్ లభించనుంది. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనుంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు కాగా.. టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగాలు కల్పించనుంది.
ఐటిఐలలో ఇక ఆధునిక శిక్షణ
ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. 50 ఏళ్ల నాటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని, అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం టాటా సంస్థ సహకారం తీసుకుంటున్నామని వెల్లడిరచారు. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని వివరించారు. తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని పేర్కొన్నారు. మేం పాలకులు, విూరు బానిసలు అనే ఆలోచన లేదు. మేం సేవకులం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉపాధి లభిస్తుందని విశ్వసిస్తానని అన్నారు. సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలు పెంచవు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారంటీ ఇస్తుంది. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలు ఐటీసీలుగా మారుస్తున్నాం. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఐటీ రంగంలో ప్రపంచంలో తెలుగు వారు పోటీ పడుతున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యతని అన్నారు. రాష్ట్రంలో గల 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దుతాం. నైపుణ్యాలను నేర్పించి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం. విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి. ఈ శాఖ తన వద్ద ఉంటుంది. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. ప్రతి నెలా సవిూక్ష నిర్వహిస్తా అని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పదేళ్లకుగానూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల దీర్ఘ కాల (లాంగ్ టర్మ్) కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల స్వల్ప కాలిక కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74). ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాలజీ హబ్) పని చేస్తాయి. ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందజేస్తాయని అధికారులు తెలిపారు.
సిఎంతో కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ సిఇవో భేటీ
హైదరాబాద్(జనంసాక్షి): సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు సమాచారం,. తెలంగాణ ప్రభుత్వం పరివ్రమల ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.