నేటి నుంచి సభాపర్వం
` అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం
` ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం
` పోలీసుల మూడంచెల భద్రతతో నిర్వహణ
` అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విపక్షాలు
` హామీల అమలుతో ధీమాలో రాష్ట్ర ప్రభుత్వం
` రేపటి నుంచి శాసనమండలి సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మూడంచెల భద్రతతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతుండగా, బుధవారం నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది. సమావేశాలు జరిగేటప్పుడు వివిధ వర్గాలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో గన్‌పార్క్ వద్ద, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించనున్నారు.అసెంబ్లీ సమావేశాలకు సివిల్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించేది లేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాస్‌లు ఉన్నా కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇస్తారని అధికారులు తెలిపారు. మొదటి రోజున ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాస్య నందితకు సభలో నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెల రెండో తేదీ వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాలు ఎప్పటి వరకు జరుగుతాయన్నది రేపటి బీఏసీ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిరచనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి శాసన సభాపక్షం మంగళవారం సమావేశం కానుంది. శాసనసభ వాయిదా పడిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.మరోవైపు బీజేపీఎల్పీ నేడు సమావేశమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, అనుసరించాల్సిన ఎత్తుగడలపై ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరై, శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టేలా మార్గ నిర్దేశనం చేశారు.