గుంతలమయంగా మారిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన ప్రయాణం

జడ్చర్ల, జూలై 20 (జనంసాక్షి):జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రంగారావు తోట రోడ్డు తీవ్రంగా ధ్వంసమై గుంతలమయంగా మారింది. పాత బజార్ గాంధీ బొమ్మ నుంచి క్లబ్ రోడ్, సిగ్నల్ గడ్డ వరకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా రంగారావు తోటలోని విజేత కిరాణం ముందు నుండి క్లబ్ రోడ్డు వరకు రోడ్డు పూర్తిగా గుంతలపాలైంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించడానికి వాహనదారులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఈ గుంతల్లో నీరు నిలిచిపోయి, రోడ్డు ఏమాత్రం కనిపించక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ప్యాచ్ వర్క్ పనులు చేపట్టి, రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.



