సచివాలయం చుట్టూ 163 సెక్షన్
రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్ విధించారు. సెక్రటేరియట్ పార్కింగ్ గ్రౌండ్‌లో సుమారు 200 మంది సిబ్బందిని మోహరించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద పోలీసు వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కాగా, వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.శనివారం భార్యాపిల్లలతో రోడ్డెక్కిన కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో ఒకే రోజు 39 మందిని సస్పెన్షన్ చేస్తూ అర్ధరాత్రి వేళ ఉత్తర్వులు ఇచ్చింది. తమ సహోద్యోగులు సస్పెన్షన్ గురికావడంతో వారికి బెటాలియన్ కానిస్టేబుళ్లంతా బాసటగా నిలిచారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్ పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు. అనంతరం రాత్రి వేళ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకారం సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లు నగరానికి బయలుదేరినట్టు సమాచారం. పోలీసుల ఆంక్షలు, తనిఖీలు నడుమ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నగరబాట పట్టిన బెటాలియన్ కానిస్టేబుళ్ల సచివాలయ ముట్టడి ఎక్కడికి దారితీస్తుందోనని సర్వత్రా ఆందోళన నెలకొన్నది.మరోవైపు నగరంలో ఆందోళన నేపథ్యంలో పోలీసులు నెలరోజుల పాటు ఆంక్షలు విధించారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి నవంబర్ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు.