జగదాంబ తండా గ్రామంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం

– భారీగా పాల్గొన్న గ్రామ ప్రజలు
సిరికొండ, జూలై 12 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని జగదాంబ తండా గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, బీఎల్ఓలు (BLOలు), జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి నాయక్ పాల్గొని గ్రామ ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఓటరు ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో ఎస్‌ఐఆర్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ఫారాలు నింపించుకున్నారు. వృద్ధులు, నిరక్షరాస్యులకు బీఎల్ఓలు మరియు స్థానిక నాయకులు ప్రత్యేకంగా సహాయం చేసి ఫారాలు సక్రమంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు