జూన్ 2న మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని ప్రజాదర్బార్‌లో ‘స్కై’ వినతి
హైదరాబాద్, మే 23 (జనంసాక్షి) :
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరు జరిగిందని, ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలకు సిద్ధపడితేనే రాష్ట్రం సిద్ధించిందని స్కై ఫౌండేషన్ పేర్కొంది. అందువల్ల అమరవీరుల త్యాగాలతో నిర్మితమైన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం రోజు జూన్ 2న మద్యం, మాంసం దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. నాడు దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు సర్వం త్యజించారని, వారి జ్ఞాపకార్థంగా ఆగస్ట్ 15న, జనవరి 26న మద్యం, మాంసం దుకాణాలు మూసివేస్తున్నట్టు ఆనవాయితీని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో జూన్ 2న కూడా మద్యం, మాంసం షాపులను బంద్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజాదర్బార్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ మాట్లాడుతూ.. ఈ చర్యలు తీసుకుంటే అమరులకు ఘన నివాళులు అర్పించినట్టవుతుందని అన్నారు. రాష్ట్ర చరిత్ర, ఉద్యమాలు, సాకారమైన సందర్భాలను ప్రతి తరానికీ తెలియజేసేవిధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, దేశం, రాష్ట్రం గురించి ప్రతి అంశం పట్ల వారికి అవగాహన పెంపొందించాలని, అందుకు జూన్ 2న ప్రతి పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులతో పాటు తెలంగాణ కోసం కొట్లాడిన అమరుల గురించి కూడా ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఇది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని విన్నవించారు. ఇప్పటికే 11 సంవత్సరాలు పూర్తయినా అమరుల త్యాగాలను ప్రతిబింబించేలా కచ్చితమైన చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోజు మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేయించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు స్కై ఫౌండేషన్‌ను చిన్నారెడ్డి అభినందించారు.